415 మంది కవులతో పోటీపడి తొలి బహుమతి కైవసం — భద్రాచలం పట్టణానికి గర్వకారణం
భద్రాచలంటౌన్:అక్టోబరు10(తొలిఅడుగు న్యూస్)
రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో భద్రాచలం పట్టణానికి చెందిన న్యాయవాది, కవి పామరాజు తిరుమలరావు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన భవిత సాహితీపీఠం నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా 415 మంది కవులు పాల్గొనగా, తన కవితా ప్రతిభతో తిరుమలరావు అందరినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు.
సాహిత్య రంగంలో తనదైన ప్రతిభను చాటుకుంటూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని సాధించడం పట్ల భద్రాచలం పట్టణానికి చెందిన సాహితీవేత్తలు, న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవృత్తిలో కొనసాగుతూనే సాహిత్యంపై ఆసక్తితో పోటీల్లో పాల్గొని విశేష గుర్తింపు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన విజయం భద్రాచలం పట్టణానికి గర్వకారణమని కొనియాడారు.
ఈ సందర్భంగా పోటీలో ప్రథమ స్థానాన్ని సాధించిన పామరాజు తిరుమలరావును భవిత సాహితీపీఠం నిర్వాహకులు జి. హనుమంతరావు, కె. శేషగిరి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని సాహిత్య విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.








