పాల్వంచ:అక్టోబర్08(తొలిఅడుగున్యూస్)

కరాటేలో అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన అబ్దుల్ నుమాన్‌కు పాల్వంచలో ఘన సన్మానం లభించింది. టీఆర్‌వీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కేటీపీఎస్ హెచ్-58లోని టీఆర్‌వీకేఎస్ ప్రాంతీయ కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ నుమాన్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి, గిన్నిస్ రికార్డు సాధించినందుకు అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే కరాటేలో ప్రతిభను చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
నుమాన్ సాధించిన విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆయన తండ్రి, కేటీపీఎస్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్‌ను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నుమాన్‌కు కరాటేలో శిక్షణ అందిస్తున్న నవోదయ కరాటే ఇన్‌స్టిట్యూట్ మాస్టర్ రాంబాబు సేవలను ప్రశంసించారు. నుమాన్ విద్యాభ్యాసం చేస్తున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా అభినందించారు.
ఈ సందర్భంగా టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్, జెన్‌కో సెక్రటరీ ముత్యాల రాంబాబు మాట్లాడుతూ.. అబ్దుల్ నుమాన్ సాధించిన గిన్నిస్ రికార్డు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా టీఎస్ జెన్‌కో సంస్థకు కూడా గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో నుమాన్ ఈ స్థాయికి చేరుకోవడం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.
భవిష్యత్తులో నుమాన్ మరిన్ని ఉన్నత విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి, టీఎస్ జెన్‌కోకు, పాల్వంచ ప్రాంతానికి మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ 5, 6, 7 దశల నాయకులతో పాటు జెన్‌కో, టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర, బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు, నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొని అబ్దుల్ నుమాన్‌ను అభినందించారు.








