#మోకిల మల్లన్న ఆలయానికి రూ.2.50 లక్షల సొంత నిధులతో బోరు ఏర్పాటు
చేవెళ్ల:అక్టోబర్02 (తొలిఅడుగు న్యూస్): ప్రతినిధి శ్రీపాల్
దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, గ్రామ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు శంకర్‌పల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నె వెంకటేశ్ ముదిరాజ్ తన వంతు సేవా సహకారాన్ని అందించారు. మోకిలా గ్రామంలోని శ్రీ మల్లన్న స్వామి దేవాలయ ప్రాంగణంలో రూ.2.50 లక్షల తన సొంత నిధులతో నూతన నీటి బోరును ఏర్పాటు చేయించి తన సేవా నిరతిని చాటుకున్నారు.
ఆలయానికి నిత్యం వచ్చే భక్తులతో పాటు గ్రామ ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలనే సదుద్దేశంతో ఈ బోరును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రాంగణంలో శాశ్వత నీటి వసతి కల్పించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బోరు అందుబాటులోకి రావడంతో ఆలయ నిర్వహణకు, భక్తుల సౌకర్యానికి ఎంతో మేలు చేకూరనుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌండ్ర సత్యం, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాల్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నె వెంకటేశ్ ముదిరాజ్ చేసిన సేవను పలువురు కొనియాడుతూ ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. శ్రీ మల్లన్న స్వామి ఆలయానికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, భక్తులకు, గ్రామ ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమంలో భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు, ఆలయానికి అవసరమైన సేవా కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
గ్రామం సుభిక్షంగా, సంతోషంగా వర్ధిల్లాలని, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
సేవా భావంతో ముందుకొచ్చిన మన్నె వెంకటేశ్ ముదిరాజ్‌ను గ్రామ ప్రజలు అభినందిస్తూ, ఆయన చేసిన ఈ సేవ ఆదర్శనీయమని కొనియాడారు.








