సమయస్ఫూర్తితో స్పందించి కాపాడిన సీఐ సట్ల రాజు
భద్రాచలం టౌన్ :అక్టోబర్ 08 (తొలి అడుగు న్యూస్)
భద్రాచలం–సారపాక మధ్య గోదావరి వంతెనపై నుంచి నదిలోకి దూకిన ఓ యువకుడిని పట్టణ నూతన సీఐ సట్ల రాజు సమయస్ఫూర్తితో స్పందించి రక్షించారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో యువకుడు సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
దుమ్ముగూడెం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన జంపన్న (20) మద్యం మత్తులో వంతెనపై నుంచి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ బండరాళ్లకు తగలకుండా నీటిలో పడిన అతను స్పృహ కోల్పోయాడు. గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయిన జంపన్న కొంతదూరంలోని ఇసుక దీవి వద్ద ఆగిపోయాడు.
రాత్రి సుమారు 2 గంటల సమయంలో స్పృహలోకి వచ్చిన యువకుడు సహాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ సట్ల రాజు ఘటనాస్థలికి చేరుకుని, గజ ఈతగాడు కరుకు ప్రసాద్ సహాయంతో గోదావరిలోకి వెళ్లి యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.
అనంతరం జంపన్నను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు.
అయితే యువకుడు తిరిగి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ముందుజాగ్రత్తగా అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి వారి వెంట పంపించనున్నట్లు సీఐ సట్ల రాజు తెలిపారు.
అర్ధరాత్రి వేళ సమాచారం అందిన వెంటనే స్పందించి, గోదావరి ప్రవాహంలో చిక్కుకున్న యువకుడి ప్రాణాలను కాపాడిన సీఐ సట్ల రాజు, గజ ఈతగాడు కరుకు ప్రసాద్‌ను స్థానికులు అభినందించారు.








