భద్రాచలంలో అట్టహాసంగా శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనోత్సవం

– జైశ్రీరాం నినాదాలతో మార్మోగిన భద్రగిరి..

– జయజయ ధ్వానాల నడుమ శోభాయాత్ర

భద్రాచలం టౌన్: అక్టోబర్ 07 (తొలిఅడుగు న్యూస్)

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనోత్సవం బుధవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో, అట్టహాసంగా నిర్వహించారు. భక్తులు ఎంతో నిష్టతో, భక్తిభావంతో రాసిన శ్రీరామకోటి పుస్తకాలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పుస్తకాలను ప్రత్యేక హుండీలో భద్రపరిచిన శ్రీరామకోటి పుస్తకాలను ప్రత్యేకంగా హుండీ నుంచి బయటకు తీసి ట్రాక్టర్ వాహనంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శోభాయాత్రను ప్రారంభించారు. భజనలు, రామనామ సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
శ్రీరామకోటి పుస్తకాలతో పాటు రామరథం శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ నామస్మరణ చేస్తూ గోదావరి బ్రిడ్జి వరకు తరలివచ్చారు.
గోదావరి వంతెన మధ్యభాగానికి చేరుకున్న అనంతరం పుణ్య గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చీర, సారె సమర్పించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.
నిమజ్జనోత్సవం అనంతరం వైదిక సిబ్బంది గోదావరి నదికి ప్రత్యేక హారతి అందించారు. ఈ సందర్భంగా గోదావరి తీరం మొత్తం “జైశ్రీరాం.. జైజై శ్రీరాం..” నినాదాలతో మార్మోగింది. భక్తులు శ్రీరాముడిని స్మరించుకుంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :