హైదరాబాద్:అక్టోబర్08(తొలిఅడుగు న్యూస్)
షాబాద్: దేవుడు ప్రత్యక్షమై ‘‘నీకు ఏం కావాలి?’’ అని అడిగితే.. పిల్లలు సాధారణంగా బొమ్మలు, కొత్త దుస్తులు, ఇష్టమైన వస్తువులు కోరుకుంటారు. కానీ ఓ ఐదో తరగతి చిన్నారి మాత్రం అందరి హృదయాలను కదిలించే సమాధానం రాసింది.
హైదరాబాద్ శివారు షాబాద్‌లోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్ తెలుగు పరీక్షలో భాగంగా.. ‘‘మీకు లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటారు?’’ అనే ప్రశ్నను విద్యార్థులకు ఇచ్చారు.
అందుకు ఓ ఐదో తరగతి విద్యార్థిని రాసిన సమాధానం చూసి ఉపాధ్యాయులే భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నాకు మా నాన్న కావాలి’’ అని ఆ చిన్నారి సమాధానం రాసింది.
రెండేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి.. దేవుడిని ఏదైనా కోరుకునే అవకాశం వస్తే తన తండ్రినే తిరిగి ఇవ్వాలని కోరుకోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. వయసుకు మించిన బాధను తన చిన్న మనసులో దాచుకున్న ఆ బాలిక రాసిన ఒక్క వాక్యం.. తండ్రి ప్రేమను కోల్పోయిన ఓ చిన్నారి మనసులోని వెలితిని కళ్లకు కట్టినట్లు చూపించింది.
( Poster AI create)








