రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం.
మన తెలంగాణ మన సంస్కృతి.
అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్: అక్టోబర్ 9 (తొలిఅడుగు న్యూస్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానుండగా, తొమ్మిది రోజులపాటు మహిళలు ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలిచే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. పాటలు, ఆటలతో బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా సందడి చేయనున్నాయి.
ఈ నెల 18న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐకమత్యంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని, మహిళల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూల సోయగాలతో పల్లెపల్లెనా సందడి చేయనుంది.








