ప్రశాంతంగా కొనసాగిన భద్రాచలం బంద్

* శరత్ హత్యకు నిరసనగా భద్రాచలం బంద్..

* విల్లంబులతో రోడ్డెక్కిన ఆదివాసీలు!

* అంబేద్కర్ సెంటర్‌లో భారీ ధర్నా..

* శరత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు

* విద్యా,వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేత.. బంద్‌లో పాల్గొన్న అఖిలపక్ష నేతలు

భద్రాచలంటౌన్:నవంబర్21(తొలిఅడుగున్యూస్)

గిరిజన యువకుడు తెల్లం శరత్ హత్యకు నిరసనగా ఆదివాసీ సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఇచ్చిన భద్రాచలం పట్టణ బంద్ పిలుపు ప్రశాంతంగా కొనసాగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బంద్ సంపూర్ణంగా జరిగింది.

ఈ నెల 16న హత్యకు గురైన శరత్‌కు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం నుంచే ఆదివాసీ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.

పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లో పర్యటిస్తూ వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలను మూసివేయాలని కోరారు. దీంతో పట్టణంలోని పలు వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే ఆర్టీసీ బస్సులు, ఆటోలు యథావిధిగా తిరుగుతున్నాయి.
ఈ బంద్‌లో ఆదివాసీ సంఘాల నాయకులతో పాటు బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఆదివాసీలు విల్లంబులు చేతబట్టి భారీ ధర్నా ,మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిజన యువకుడి హత్యపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

అద్దె గది కోసం వస్తే ప్రాణాలు తీస్తారా?

శరత్ గది అద్దె కోసం వెళ్లిన సందర్భంలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని ఆదివాసీ నాయకులు పేర్కొన్నారు. శరత్ ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీసులకు అప్పగించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందని, అంతేకానీ ప్రాణాలు తీసే అధికారం ఎవరికీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగానే భద్రాచలం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు.

శరత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆదివాసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. భద్రాచలం గిరిజన ప్రాంతమని, ఇక్కడ నివసిస్తున్న అమాయక ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలను సహించేది లేదని హెచ్చరించారు.

ఇంతకాలం సహనంతో ఉన్న ఆదివాసీలు తమ హక్కులు, ఆత్మగౌరవం, రక్షణ విషయంలో ఇకపై మౌనంగా ఉండబోరని నాయకులు స్పష్టం చేశారు. అమాయక గిరిజనులపై దాడులు జరిగితే ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
శరత్ హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాలు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :