భద్రాచలం–చర్ల రహదారిపై అడుగడుగునా గుంతలు.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం!

# నరకప్రాయంగా మారిన భద్రాచలం – చర్ల ప్రధాన రహదారి!

# గుంతలమయమైన రోడ్డుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం..

# పాలకుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం!

# 30 నిమిషాల ప్రయాణానికి గంటన్నర సమయం..

# ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి!

# మృత్యువు ముంగిట ప్రయాణం చేస్తున్నా పట్టించుకోరా?

# ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించాలి!

# గుంతలే స్వాగతం.. దుమ్మే వీడ్కోలు!

భద్రాచలంటౌన్:నవంబర్15(తొలిఅడుగున్యూస్)

భద్రాచలం నుంచి చర్ల వరకు ఉన్న ప్రధాన రహదారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. అడుగడుగునా పెద్దపెద్ద గుంతలు.. ధ్వంసమైన రహదారులు.. దుమ్ము ధూళితో నిండిన పరిసరాలు.. వెరసి ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారి ఇంతటి దుస్థితికి చేరినా పాలకులు, సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

30 నిమిషాల ప్రయాణానికి గంటన్నర!

30 నిమిషాల ప్రయాణానికి గంటన్నర!
భద్రాచలం నుంచి పర్ణశాల వరకు సాధారణంగా 30 నిమిషాల్లో చేరుకోవాల్సిన ప్రయాణానికి ప్రస్తుతం గంటన్నర సమయం పడుతోంది. పర్ణశాల శ్రీరామాలయ దర్శనం కోసం నిత్యం ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి దుస్థితి కారణంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులు రహదారి పరిస్థితి చూసి ‘స్వామీ.. నీ దర్శనంతో పాటు ఈ రోడ్ల బాధ నుంచి కూడా కాపాడాలి’ అంటూ ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది.

ఇసుక లారీలతో మరింత ధ్వంసం!

ఇప్పటికే గుంతలమయంగా మారిన రహదారిపై అధిక సంఖ్యలో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. భారీ వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారి నిర్వహణ చేపట్టకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. పలుచోట్ల రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.

దుమ్ముతో ప్రజలకు మరో నరకం!

రహదారి ధ్వంసం కావడంతో వాహనాలు వెళ్లిన ప్రతిసారీ పెద్దఎత్తున దుమ్ము లేచి సమీపంలోని దుకాణాలు, ఇళ్లతో పాటు పంట పొలాలపై పేరుకుపోతోంది. దీంతో దుకాణదారులు, స్థానిక ప్రజలు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతల సమస్యకు తోడు దుమ్ము కాలుష్యం కూడా ప్రజలకు మరో సమస్యగా మారింది.

ప్రమాదాలు జరిగినా మేల్కొనరా?

ఈ రహదారిపై ప్రయాణిస్తూ ఇటీవల కొందరు
ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రహదారి అభివృద్ధిపై శాశ్వత చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఇదే మార్గంలో స్థానిక ఎమ్మెల్యే సైతం నెలలో పలుమార్లు ప్రయాణిస్తున్నప్పటికీ రహదారి దుస్థితి పరిష్కారం కాకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పాలకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై కనీస మరమ్మతులు చేపట్టలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రజలు నిలదీస్తున్నారు.

ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రహదారి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా నాణ్యతా ప్రమాణాలతో శాశ్వత ప్రాతిపదికన నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాకుండా భారీ ఇసుక లారీల రాకపోకలపై తగిన నియంత్రణ, రహదారి నిర్వహణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించడం పాలకుల బాధ్యత. ప్రమాదాలు జరిగిన తర్వాత పరామర్శలు కాదు.. ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలి. భద్రాచలం–చర్ల రహదారికి ఇప్పటికైనా మోక్షం కల్పిస్తారా? లేక ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తారా? అన్నది పాలకులే సమాధానం చెప్పాలి!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :