73 ఏళ్ల భద్రాచలం బిడ్డ విజయగాథకు అంతర్జాతీయ గుర్తింపు!
అమెరికాలో రెండు ప్రపంచ పతకాలు.. ఇప్పుడు విద్యార్థుల పోటీ పరీక్షల్లోనూ శంకరరావు పేరు!
భద్రాచలంటౌన్:నవంబర్18(తొలిఅడుగున్యూస్)
వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని.. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ వయసులోనైనా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తున్నారు భద్రాచలానికి చెందిన 73 ఏళ్ల క్రీడా విజేత డి.వి. శంకరరావు. అమెరికాలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు అంతర్జాతీయ పతకాలు సాధించి భద్రాచలం కీర్తిని ప్రపంచ వేదికపై నిలిపిన ఆయన విజయ ప్రస్థానం ఇప్పుడు మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఆయన విజయాలు ఏకంగా పోటీ పరీక్షల కరెంట్ అఫైర్స్ పాఠ్యాంశాల్లోనూ చోటు సంపాదించాయి.
పోటీ పరీక్షలకు శిక్షణ, అధ్యయన సామగ్రిని అందించే ప్రముఖ విద్యాసంస్థ ఎక్సాంపూర్ (Exampur) నవంబర్ 17, 2026న తన కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ విభాగంలో శంకరరావు ప్రపంచ విజయాలపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా, పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం రూపొందించిన ప్రశ్నల్లో ఆయన పేరు, సాధించిన ప్రపంచ పతకాలు, బరువు విభాగం వివరాలను సైతం చేర్చడం విశేషం. ఒక ప్రాంతీయ క్రీడాకారుడి విజయం జాతీయ స్థాయి విద్యార్థుల అధ్యయనంలో ప్రస్తావనకు రావడం భద్రాచలానికి గర్వకారణంగా నిలిచింది.
గుండె శస్త్రచికిత్స నుంచి ప్రపంచ పతకాల వరకు.. అసాధారణ ప్రస్థానం!
2012 సెప్టెంబరులో 59 ఏళ్ల వయసులో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న శంకరరావు, జీవితంలో ఎదురైన ఆరోగ్య సవాళ్లకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. 2025 ఫిబ్రవరిలో 71 ఏళ్ల వయసులో వ్యాయామశాలలో శిక్షణ ప్రారంభించి తన క్రీడా ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
అదే ఏడాది ఆగస్టులో కేరళలోని కోజికోడ్‌లో జరిగిన జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌తో పాటు నాలుగు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆయన అంతర్జాతీయ వేదికపైనా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
2026 అక్టోబరులో అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాస్టర్స్-4, 74 కిలోల విభాగంలో పోటీపడి అక్టోబర్ 15న క్లాసిక్ ఓవరాల్ విభాగంలో కాంస్య పతకం, అక్టోబర్ 22న ఎక్విప్డ్ ఓవరాల్ విభాగంలో రజత పతకం సాధించి ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటారు.
‘మన్ కీ బాత్’లో ప్రస్తావించాలని ఎమ్మెల్యే సిఫారసు!
శంకరరావు సాధించిన అసాధారణ విజయాలు ఇప్పటికే ప్రజాప్రతినిధుల దృష్టిని ఆకర్షించాయి. ఆయన స్ఫూర్తిదాయక క్రీడా ప్రస్థానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ఇప్పటికే సిఫారసు చేశారు.
యువతకు నా విజయమే స్ఫూర్తి కావాలి: శంకరరావు
తన విజయాలపై శంకరరావు స్పందిస్తూ..
“నా ప్రపంచ పతకాల విజయాన్ని విద్యార్థుల కరెంట్ అఫైర్స్ సాధనలో ప్రస్తావించడం నాకు ఎంతో ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. వయసుతో సంబంధం లేకుండా సంకల్పం, క్రమశిక్షణ ఉంటే కొత్త లక్ష్యాలను చేరుకోవచ్చనే సందేశం యువతకు చేరాలి. అదే నా విజయానికి నిజమైన సార్థకత” అని పేర్కొన్నారు.









