పేద కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా

బూర్గంపాడు మండలంలో తొలి కార్యక్రమానికి అంజనాపురంలో శ్రీకారం

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పథకం ఆవిష్కరణ

బూర్గంపహాడ్: నవంబర్20(తొలిఅడుగున్యూస్)

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించి, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి బూర్గంపాడు మండలంలో శ్రీకారం చుట్టారు. మండలంలో తొలిసారిగా అంజనాపురం గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా జీవిత బీమా పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంపై అవగాహన పెంచుకొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బూర్గంపాడు మండలంలో అంజనాపురం గ్రామపంచాయతీ వేదికగా ఈ కార్యక్రమం ప్రారంభం కావడం విశేషంగా నిలిచింది. గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు భరోసానిస్తూ, అనుకోని ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తుందనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.ఆర్.కె.వి. ప్రసాద్, ఎంపీడీవో జములారెడ్డి, జీపీఓ అధికారి అనూష, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. అధికారుల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :