కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం పచ్చజెండా!

సుజాతనగర్‌లో 667 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఆమోదం

ఆరు ప్రాంతాల్లో సర్వేలు.. చివరకు సుజాతనగర్‌ ఎంపిక

ఏళ్లనాటి కల సాకారం దిశగా అడుగులు.. ఇక భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

కొత్తగూడెం:నవంబర్15(తొలిఅడుగున్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల ఏళ్లనాటి విమానాశ్రయ కల సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ నుంచి సానుకూల నిర్ణయం వెలువడినట్లు సమాచారం. సుజాతనగర్‌ సమీపంలో సుమారు 667 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించినట్లు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైనట్లయింది.

ఆరు ప్రాంతాల్లో సర్వేలు.. సుజాతనగర్‌కు ప్రాధాన్యం

విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకు జిల్లాలోని పెనగడప, పాల్వంచ–దమ్మపేట, చాపరాలపల్లి, దుమ్ముగూడెం, సుజాతనగర్‌, సీతంపేట ప్రాంతాల్లో అధికారులు వివిధ దశల్లో సర్వేలు నిర్వహించారు. భూమి లభ్యత, రన్‌వే నిర్మాణానికి అనుకూలత, భూమి ఎత్తు, పరిసర అటవీ ప్రాంతాలు, వరద ముప్పు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని అంశాలను విశ్లేషించిన అనంతరం సుజాతనగర్‌ ప్రాంతం విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని ఎంపిక చేసినట్లు సమాచారం.

ప్రధాన ప్రాంతాలకు చేరువలో విమానాశ్రయం

ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతం నుంచి ప్రధాన రహదారి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ 5.7 కిలోమీటర్లు, భద్రాచలం 35.4 కిలోమీటర్లు, సింగరేణి ప్రాంతం 32.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సర్వే నివేదికలో పేర్కొన్నారు. అభయారణ్యం సైతం సుమారు 7.4 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు.

వరద ముప్పుపైనా ప్రత్యేక పరిశీలన

గోదావరి వరదల ప్రభావాన్ని కూడా అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు. 1986లో సంభవించిన తీవ్ర వరద ప్రభావిత ప్రాంతానికి 23.1 కిలోమీటర్లు, 2022లో వచ్చిన భారీ వరదల ప్రభావిత ప్రాంతానికి 25.5 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత విమానాశ్రయ స్థలం ఉన్నట్లు సర్వే నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం.

భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి అడుగులు

కేంద్ర స్థాయిలో అనుమతులు లభించిన నేపథ్యంలో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పారిశ్రామిక రంగం, పర్యాటకం, వాణిజ్యం, రవాణా రంగాలకు ఊతం లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో వరంగల్‌ మామునూరు, ఆదిలాబాద్‌ విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి పనులు ముందుకు సాగుతున్న నేపథ్యంలో కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనకు అనుమతి లభించిందన్న సమాచారం జిల్లావాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే విమానాశ్రయ నిర్మాణం, భూసేకరణ, తదుపరి అనుమతులు పూర్తయి పనులు ప్రారంభమైతేనే ఈ కల వాస్తవరూపం దాల్చనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :