అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలి!

అసలైన లబ్ధిదారులకు అన్యాయం.. అనర్హులకు ఇళ్ల కేటాయింపులపై తెలంగాణ రక్షణ సేన ధర్నా

అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసి నిరుపేదలకు అందించే వరకు పోరాటం: కనగాల చైతన్య

భద్రాచలంటౌన్:నవంబర్13(తొలిఅడుగున్యూస్)

భద్రాచలం పట్టణంలోని మనుబోతుల చెరువు వద్ద ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య ఆరోపించారు. అసలైన నిరుపేదలను పక్కనపెట్టి, డబ్బులు, రాజకీయ పలుకుబడి, సిఫార్సులు ఉన్నవారికి ఇళ్లు కేటాయించారని ఆమె విమర్శించారు.

ఈ సమస్యపై శుక్రవారం మనుబోతుల చెరువు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద అర్హులైన నిరుపేదలతో కలిసి ఆమె ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కనగాల చైతన్య మాట్లాడుతూ.. తాము నిరుపేదలమని చెప్పి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన కొందరు వాటిలో నివసించకుండా ఇతరులకు అద్దెకు ఇచ్చి నెలనెలా అద్దెలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరాల్సి ఉండగా, అర్హత లేని వారికి ఇళ్లు కేటాయించడం వల్ల అసలైన పేదలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా మనుబోతుల చెరువు వద్ద నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రవేశించి నివాసం ఉంటున్నారని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని, ఇళ్ల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి, నిజమైన నిరుపేదలకు న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని కనగాల చైతన్య స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :